Home Remedies For Cough In Telugu : దగ్గు సమస్యను తగ్గించే అద్భుతమైన సులువైన ఇంటి చిట్కాలు
కాలం మారింది, వేసవి విరామం తీసుకుని వెళ్ళిపోయింది. శీతాకాలం ఎంట్రీ ఇచ్చింది. చలిచలిగా, తుంపరజల్లులతో రోజంతా సూర్యుణ్ణి మబ్బుల మాటున దాచేసి బద్దకాన్ని పెంచే కాలమిదే. వర్షాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు తొందరగా వ్యాప్తి చెందే ఈ కాలంలో ఆహారం, నీరు ద్వారా తొందరగా ఎదురయ్యే సమస్య దగ్గు. ఇది క్రమంగా గొంతు నొప్పికి దారి తీసి, ఏమి తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది పెట్టే సమస్య. పైగా ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో కాస్త దగ్గు వచ్చినా భయపడిపోయి టెన్షన్ తోనే సమస్యలను పెంచుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్తారు.
డాక్టర్ల సలహా మంచిదైనప్పటికి బారులు తీరే జనాల మధ్యన అంత సేఫ్టీ అనిపించదు కూడా. అందుకే ఇంట్లోనే సులువుగా దగ్గును తరిమి కొట్టగల అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకుంటే శీతాకాలాన్ని కూడా ఆస్వాదించేయచ్చు.
తేనె

తేనె దగ్గుకు ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్న ఆయుర్వేదంలో భాగమైన ఔషధం. సాధారణ అల్లోపతి మందులతో పోలిస్తే దగ్గు తగ్గించడంలో తేనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
ఇది అన్ని వయసుల వారికి కూడా ఎంతో ఉపయోగకరం. అయితే సంవత్సరంలోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదు.
తేనెను తీసుకునే విధానం సులువైనది. గోరు వెచ్చని నీరు, లేదా హెర్బల్ టీ లో రెండు స్పూన్ల తేనె కలిపి తాగాలి. దీన్ని రోజుకు రెండుసార్లు వాడుతుంటే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి

తల్లి కూడా చేయలేని మేలు ఉల్లి చేస్తుంది, ఉల్లి కూడా చేయలేని మేలు వెల్లుల్లి చేస్తుంది. వెల్లుల్లిని దాని వాసన కారణంగా దూరం పెట్టేవాళ్ళు ఎక్కువ. కానీ ఇదొక అద్భుతమైన ఔషధం. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తపోటు తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
◆ తరిగిన వెల్లుల్లిని వేయించి పడుకునే ముందు ఒక చెంచా తేనెతోకలిపి తీసుకోవాలి. అలాగే ఆహారంలో వెల్లుల్లిని విరివిగా వాడాలి. వెల్లుల్లి చారు కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.
◆ అన్ని చేసుకోవడానికి బద్దకం అనేవారు ఒక రెండు వెల్లుల్లిపాయలను పచ్చిగానే నోట్లో వేసుకుని బాగా నమిలి మింగేయాలి. ఇది తినడం కాస్త కష్టమే, కారంగా కూడా ఉంటుంది. కానీ దీని ఫలితం నిమిషాలలోనే తెలుస్తుంది.
అల్లం

అల్లం ఒక సూపర్ ఫుడ్, ఇది వికారం, జలుబు, ఫ్లూ మరియు దగ్గుతో సహా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అల్లం లోని ఒక రసాయన సమ్మేళనం దగ్గును తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.
అంతే కాదు దగ్గు దృష్ట్యా ఎక్కువయ్యే ఆయాసం, ఉబ్బసం లక్షణాలకు కూడా అల్లం మంచి ఔషధం. వాయు మార్గాన్ని అందులో ఉన్న ఇబ్బందులను తొలగించగలదు.
◆ అల్లంను బాగా చితక్కొట్టి టీ మరియు పాలలో వేసి బాగా ఉడికించి తాగవచ్చు.
◆ అల్లం ను చితక్కొట్టి రసం పిండుకుని ఒక స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవచ్చు.
◆ అల్లం రసం తీసి అందులో పటికబెల్లం వేసి బాగా పాకం వచ్చేదాకా ఉడికించి. తరువాత దాన్ని ఒక షీట్ మీద అరస్పూన్ మోతాదు అంత పాకాన్ని వేయాలి. చల్లారిన తరువాత వాటిని లాగితే పైకి లేస్తాయి.
బయట మార్కెట్ లో దొరికే విక్స్, స్ట్రెప్సిల్స్ లా ఇవి పని పనిచేస్తాయి. కెమికల్స్ లేని సహజ దగ్గు బిళ్లలు ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు.
పైనాపిల్

పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది దగ్గుకు సమర్థవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఈ ఎంజైమ్ దగ్గును అణచివేయడానికి మరియు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
◆ దగ్గుతో బాధపడుతున్నప్పుడు, నేరుగా పైనాపిల్ తినవచ్చు. తాజా పైనాపిల్ రసాన్ని తాగవచ్చు. అయితే జ్యూస్ తాగేవారు అది కూల్ లేకుండా చూసుకోవాలి.
పసుపు

పసుపు గొప్ప యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ ఔషధం. పసుపు చరిత్ర చాలా పెద్దది. భారతీయుల ఔషధ దినుసుల లిస్ట్ లో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది.
◆గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది.
◆ పసుపు, తులసి ఆకు రెండింటిని కలిపి బాగా దంచి చిన్న టాబ్లెట్స్ గా తయారుచేసి వాటిని నీడలో ఎండించాలి. ఆ తరువాత ఒక టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. దగ్గు సమస్య వచ్చినపుడు వీటిని పూటకు ఒకటి చెప్పున వేసుకుంటే దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది.
ఉప్పునీటితో గార్గిలింగ్ లేదా పుక్కిలించడం

గార్గ్లింగ్ గొంతు నొప్పిని తగ్గించడానికి వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. ఉప్పునీరు ఓస్మోటిక్, అంటే ఇది ద్రవం కదలిక దిశను మారుస్తుంది. గొంతులో అసౌకర్యాన్ని తొలగిస్తుంది. బాక్టీరియాను నిర్మూలిస్తుంది. దగ్గు వల్ల ఊపిరితిత్తులు మరియు శ్వాశ మార్గంలో శ్లేష్మం ఏర్పడటాన్ని నివారిస్తుంది.
◆1 కప్పు వెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ ఉప్పును కలపాలి. ఈ నీటిని నోటిలో వేసుకుని గొంతు లోపల భాగానికి తగిలేలా గార్గిలింగ్ చేయాలి. ఇందులో పసుపు కూడా కలుపుకోవచ్చు.
పుదీనా

పుదీనాలో మెంతోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గొంతులోని నరాల చివరలకు ఉన్న తిమ్మిరి మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. దగ్గు వల్ల గొంతులో పేరుకుపోయే శ్లేష్మం విచ్ఛిన్నం చేయడానికి మరియు గొంతు బ్లాక్ అవ్వకుండా సహాయపడుతుంది.
◆దగ్గు సమస్యను తగ్గించడానికి పుదీనా టీని రోజుకు 2-3 సార్లు తాగవచ్చు. బయట మార్కెట్ లో పిప్పరమెంట్ ఆయిల్ దొరుకుతుంది. దీంతో అరోమా థెరపీ కూడా చేస్తారు. ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
◆పుదీనా ఆకులను శుభ్రం చేసి తాజా ఆకులను మెల్లిగా నమిలి మింగవచ్చు. పిప్పరమింట్ నూనెను అరోమాథెరపీగా కూడా ఉపయోగించవచ్చు.
ఆవిరి పట్టడం

దగ్గును తగ్గించడానికి ఆవిరి పట్టడం కూడా ఒక చక్కని పరిష్కారం. వెచ్చని గాలి గొంతు ద్వారా పీల్చడం వల్ల గొంతులో బాక్టీరియా నశిస్తుంది. అలాగే దగ్గు వల్ల పొడిబారిన గొంతుకు స్వాంతన లభిస్తుంది. అంతేకాదు దగ్గు వల్ల ఏర్పడిన తలభారం, తలలో నరాల నొప్పి వంటివి కూడా మెల్లిగా తగ్గుతాయి.
◆ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించి అందులో నీలగిరి తైలం లేదా నీలగిరి ఆకులు, లేదా తులసి, పుదీనా ఆకులు, పసుపు, అవన్నీ లేకపోయినా కొద్దిగా అమృతాంజనం వేసి ఒక మందం పాటి దుప్పటిని కప్పుకుని ఆవిరి పట్టుకోవచ్చు.
సమస్య ఏది లేకపోయినా వారానికి లేదా పది రోజులకు ఒకసారి నీటి ఆవిరి పడుతుంటే ముఖ చర్మం కూడా బాగుంటుంది.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
ఇది కూడా చదవండి : ఇన్ని ప్రయోజనాలు గసగాసల్లో ఉన్నాయి అని మీకు తెలుసా ?