జుట్టు పెరుగుదలకు అద్భుతమైన చిట్కాలు
పొడవాటి జడ అమ్మాయిలకు ఎంతో ఇష్టం. కొందరికి ఆ పొడవు జడ కల. కానీ ఏమి చేసినా జుట్టు పెరగదు, మందం అవదు. ఎక్కడ వేసిన గొంగళి ఆక్కడున్నట్టు ఉంటుంది. అంతేనా జుట్టు చివర్లు చిట్లిపోవడం, పలుచగా మారిపోయి జుట్టు మాడు పాచెస్ గా బయటకు కనిపించడం, వీటన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశ్యంతో మార్కెట్ లో వచ్చే ప్రతి కొత్త ఉత్పత్తిని ఉపయోగించడం.
ఇలా ప్రయోగాలు చేయడం వల్ల జుట్టుకు మరింత నష్టమే కానీ ఎలాంటి ఫలితం ఉండదు అనే విషయం మొదట తెలుసుకోవాలి. జుట్టును కాపాడుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులు వాడి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు. సమయాన్ని కేటాయించాలి. అన్ని నిమిషాల్లో జరిగిపోవాలంటే ఎలా?? అందుకే కాస్త ఓపిక తెచ్చుకుని కింది టిప్స్ పాటిస్తే జుట్టును ఎంతో దృఢంగా పొడవుగా మార్చుకోవచ్చు.
జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఏం చేయాలి ?
◆ చాలా మంది జుట్టుకు టీవీ యాడ్స్ లో కనిపించే అడ్డమైన నూనెలు వాడుతారు. నిజానికి జుట్టుకు స్వచ్ఛమైన కొబ్బరినూనె తప్ప వేరే ఏది అవసరం లేదు.

జుట్టు పరిమాణాన్ని బట్టి ప్రతి రోజు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను గోరువెచ్చగా తలకు పెట్టుకొని చక్కగా దువ్వుకోవాలి. ఉద్యోగ రీత్యా ఆయిల్ జుట్టుతో వెళ్లలేం అనుకునేవాళ్ళు రాత్రి పడుకునే ముందు ఇలా చేసి ఉదయాన్నే తలంటు పోసుకోవచ్చు.
◆ తలకు ఉపయోగించే షాంపూ బ్రాండ్ లు ఒకటా, రెండా వామ్మో!! మార్కెట్ లలో ఎక్కడ చూసినా ఇవే. వీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది.

మన జుట్టు మాత్రం హెయిర్ ఫాల్ అవ్వడం, జట్టులో జీవం లేకుండా ఉండటం, తెల్ల వెంట్రుకలు ఇలాంటివి కూడా పెరుగుతూ వస్తాయి.
◆ తెల్ల జుట్టు ఇప్పట్లో చిన్న వయసు వాళ్ళలోనే కనబడుతోంది. వీటికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది పోషకాహార లోపం. జుట్టు సమస్య ఏదొచ్చినా అందరూ జుట్టుకు ఆయిల్ మార్చాలని, హెయిర్ పాక్ వేయాలని, షాంపూ మార్చాలని, వాళ్ళ సలహాతో వీళ్ళ సలహాతో మాశ్చరైజర్ వాడాలని.
ఇలా అన్ని అనుకుంటారు కానీ తీసుకునే ఆహారం విషయం లో మార్పులు చేసుకోవాలని అనుకోరు. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు లోపలి నుండి లభ్యమవ్వాలి. వీటి కోసం నువ్వులు, ఉసిరి, రాగులు వంటివి బాగా తినాలి. రక్తంలో హిమోగ్లోబిన్ బాగా ఉంటే జుట్టు బాగుంటుంది. కాబట్టి రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
◆ ఇప్పట్లో బయట పొల్యూషన్ ఎక్కువ. దానివల్ల జుట్టు తొందరగా డల్ గా అయిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, బయటి నుండి మెరుపు సంతరించుకోవాలన్నా మన బామ్మలు చెప్పిన పద్ధతులే ఉత్తమం. బయట దొరికే హెన్నా పౌడర్ లో కెమికల్స్ కలిసి ఉంటాయి. అందుకే దొరికితే పచ్చి గోరింటాకును రుబ్బి తలకు హెయిర్ పాక్ వేసుకోవడం మంచిది.

అది దొరకలేదా?? మందారం ఆకులు, లేక మందారం పువ్వులు, లేదంటే వంటింట్లో ఉన్న మెంతులు రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే కాస్త నిమ్మరసం జోడించి మెత్తగా పేస్ట్ చేసి హెయిర్ పాక్ వేసుకోవచ్చు. జుట్టు నల్లగా, ఒత్తుగా, పట్టు కుచ్చులా మారడంలో సహాయపడతాయి ఇవి.
◆ జుట్టు పెరుగుదల కోసం పెద్ద ఖర్చుతో కూడుకున్న ఆహారం కూడా అక్కర్లేదు. మునగ ఆకు, తోట కూర, పుదీనా మొదలైన వాటిలో పోషకాలు జుట్టు పెరుగుదలకు బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తాయి.
◆ కూరల్లో కరివేపాకును తీసి పడేస్తారేమో కానీ జుట్టు పెరుగుదలలో కరివేపాకు కేక పుట్టిస్తుంది. కరివేపాకును నీడలో ఎండించి పొడి చేసుకోవాలి. దీన్ని ఒక టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.

ప్రతిరోజు గ్లాసుడు మజ్జిగలో పావు స్పూన్ కరివేపాకు పొడి వేసి బాగా కలిపి తాగాలి. వారం లో కనీసం ఒకటి లేదా రెండు సార్లు కరివేపాకు, మందారం, గోరింట ఆకు, పెరుగు. అన్నిటినీ బాగా మిక్సీ వేసి పేస్ట్ లా చేసుకుని హెయిర్ పాక్ వేసుకుని ఒకటి లేదా రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. నెలలో మీ జట్టులో మార్పు చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.
◆జుట్టు మరియు చర్మ సంరక్షణలో కలబంద పాత్ర వర్ణించలేనిది. తాజా కలబంద జెల్ ను తలకు పెట్టుకుని గంట తరువాత తల స్నానం చేసిన సూపర్ రిజల్ట్ ఉంటుంది.

◆ జుట్టు పెరుగుదల విషయంలో మరియు వాణిజ్య ఉత్పత్తులలో కూడా మెరుస్తున్న మన వంటింటి వండర్ ఉల్లిపాయ. ఉల్లిపాయను జోడించి ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లో లభ్యమవుతుండటమే ఉల్లిపాయ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి తార్కాణం.

garlic
అయితే అవన్నీ కాకుండా ఇంట్లో తాజా ఉల్లిపాయ రసం జుట్టుకు అప్లై చేసి గంట ఆగి తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు రెండు వారాల్లో మ్యాజిక్ మీ ముందు నిలుస్తుంది.
◆ ఆయుర్వేదం జుట్టు కోసం గట్టిగా రికమెండ్ చేసే మూలిక బృంగరాజ్. దీన్నే గుంటగలగరాకు అని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చేల గట్ల వెంట పెరుగుతుంది ఇది.

స్వచ్ఛమైన ఈ ఆకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి రసం అంతా ఇగిరిపోయాక నూనెను టైట్ కంటైనర్ లో భద్రపరుచుకోవాలి.
ఇది మ్యాజిక్ హెయిర్ ఆయిల్ లా పనిచేస్తుంది. బయటి మార్కెట్ లో దొరికే బృంగరాజ్ ఆయిల్ కంటే వంద రెట్లు పలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆకు దొరకని పక్షంలో బృంగరాజ్ పౌడర్ ఆయుర్వేద మెడికల్ స్టోర్ లు, సూపర్ మార్కెట్ లలో దొరుకుతుంది. ఆ పొడి తెచ్చి దానికి సమానంగా పటికబెల్లం లేదా కలకండ తెచ్చుకుని రెండింటిని బాగా మిక్సీ వేసి దాన్ని ఒక టైట్ కంటైనర్ లో పెట్టుకోవాలి.
ప్రతిరోజు ఒక పావు స్పూన్ పొడిని నోట్లో వేసుకుని చప్పరించి తినాలి. నెలలో జుట్టు తుమ్మెద రెక్కల్లా మారిపోతుంది. ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు ఉన్నవాళ్లకు ఇదొక వరం. దీంతో పాటు సేమ్ ఉసికాయ పొడిని కూడా ఇలాగే చేయచ్చు.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
Also Read :- గర్భధారణ సమయంలో స్త్రీ ఎంత బరువు పెరగాలి ? ఎంత బరువు ఉండాలి ?