జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఏం చేయాలి
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కాలుష్యం. ఈ కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఎదురవుతున్న సమస్య జుట్టు రాలిపోవడం, జుట్టు ఎదుగుదల లేకపోవడం. దీనికి పోషకాహార లోపం కూడా కారణం అయినప్పటికీ కాలుష్యం వల్ల జుట్టు తొందరగా డామేజ్ అవుతుంది.
అలాగే కొందరు హెయిర్ పాక్ లు, హెయిర్ ఆయిల్స్, జుట్టు పెరుగుదల కోసం రకరకాల వాణిజ్య ఉత్పత్తులు ఇలా ఎన్నెన్నో వాడుతుంటారు. ఇంకా హెయిర్ స్పెషలిస్ట్ లను కలిసి బోలెడు మందులు వాడుతుంటారు.
వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటే అది ఆ మందులు వాడినన్ని రోజులు మాత్రమే ఆ తరువాత మళ్ళీ సమస్య షురూ!! జుట్టు పెరుగుదల కోసం మనం చేసే వాటిలో హెల్తి ఫుడ్ తీసుకోవడం, హెయిర్ కేర్ తీసుకోవడం మాత్రమే కాదు శరీరానికి వ్యాయామం ఉన్నట్టే జుట్టు పెరుగుదలకు కూడా వ్యాయామం ఉండలంటున్నారు నిపుణులు.
జుట్టు పెరుగుదలకు తోడ్పడే వ్యాయామాలు
మరి జుట్టు పెరుగుదల కోసం వ్యాయామాలు ఏమిటో చూసేయండి.
◆ కుదుళ్ల మసాజ్

ఇది మనందరికీ చిన్నప్పటి నుండి తెలుసు. మన అమ్మమ్మ లేదా నాన్నమ్మలు ప్రతి వారం జుట్టు కుదుళ్లలో నూనె ఇంకెలా చక్కగా మసాజ్ చేసి ఆ తరువాత కుంకుడు కాయ లేదా శీకాయ తో తలంటు పోసేవారు. అందుకే అప్పట్లో జుట్టు కూడా దృఢంగా ఉండేది.
కుదుళ్ల మసాజ్ తలలో ఉన్న నరాల పనితీరును మెరుగుపరిచి, రక్తప్రసరణ ఆరోగ్య వంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే జుట్టు పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ మసాజ్ కూడా ఎక్సర్సైజ్ ఏ నా అనుకోకండి. అది కూడా నిజంగానే జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఎక్సర్సైజ్ ఏ.
గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఒక కప్పులో వేసుకుని చేతి మునివేళ్ళతో కొద్దికొద్దిగా అద్దుకుంటూ జుట్టు కుదుళ్లకు మెల్లిగా మసాజ్ చేయాలి. గోర్లు పదును లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో కనీసం ఒకసారి వీలును బట్టి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదల సొంతం అవుతుంది.
◆ మెడ వ్యాయామాలు

మెడ చుట్టూ ఉన్న కండరాలు మరియు నరాలు తలలోపలికి అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి మెడ కండరాలకు వ్యాయామం చేయడం కూడా జుట్టు పెరగడానికి గొప్ప మార్గం.
మెడను సున్నితంగా కుడి, ఎడమ మరియు వెనక, ముందుకు తిప్పుతూ మొదలు పెట్టాలి. తరువాత మెడను వృత్తాకారంగా, సవ్యదిశలో మరియు అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా చేయడం వల్ల మీద కండరాల నుండి ప్రసరించే నరాలు ఉత్తేజం అయ్యి, జుట్టుకు లోపలి నుండి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
ఇది కూడా చదవండి :- జుట్టు పెరుగుదలకు అద్భుతమైన చిట్కాలు
◆ శ్వాస వ్యాయామాలు

భారతీయ యోగాలో ఒక ముఖ్యమైన భాగం, శ్వాస వ్యాయామం కపాలభాతి ప్రాణాయామం, ఈ కాపాలభాతి వల్ల పుర్రె లోపలి కండరాలు, నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాదు, జుట్టు రాలడాన్ని మరియు జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి కూడా ఇది ప్రసిద్ధి చెందిన వ్యాయామం.
◆ శిరోదర మర్దనా ప్రక్రియ

భారతదేశ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేదం లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. అలాగే ఆయుర్వేదంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో శిరోధర మర్దనా ప్రక్రియ కూడా ఒకటి. ఈ మర్దన వల్ల ఎంతో వేధించే మైగ్రేన్ వంటి తలనొప్పులు, జుట్టు తొందరగా తెల్లబడటం, బట్టతల, మెదడు లోపలి నరాల ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. నరాలు రిలాక్స్ అయ్యి జుట్టుపెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.
◆ శీర్షాసనం

ఆసనాలలో బోలెడు ఉంటే వాటిలో శీర్షాసనం ప్రత్యేకమైనది. తలకిందులుగా నిటారుగా ఉండటమనే ఈ అసనం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల రక్తప్రవాహం సాదారణంగా జరిగే ప్రక్రియకు విరుద్ధంగా జరుగుతుంది. అంటే రక్త ప్రవాహం జుట్టు కుదుళ్లకు సులువుగా చేరుతుంది.తద్వారా కుదుళ్ల పటిష్టంగా మారుతాయి.
వెంట్రుక సామర్థ్యము పెరిగి ఆగిపోయిన జుట్టు మళ్ళీ ఎదగడం మొదలుపెడుతుంది. వెంట్రుక చివర్ల వరకు పోషకాలు అంది చిట్లడం, తెగిపోవడం వంటివి ఆగిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది.
◆ కార్డియో వ్యాయామాలు

కార్డియో వ్యాయామాలు సాదారణంగా బరువు తగ్గి ఫిట్ గా ఉండటానికి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ వ్యాయామాలు జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తాయి. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను కార్డియో ఎక్సర్సైజ్ లు అంటారు. ఇవి శరీరం మరియు తల చుట్టూ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి,.
వీటిని నిరంతరం సాధన చేసే వారికి మందంగా, పొడవాటి జుట్టు ఉండటం తరచుగా గమనించవచ్చు. అంతే కాదు, వీటి వల్ల చెమట ఎక్కువ పడుతుంది. వాస్తవానికి శరీరంలో చనిపోయిన కణాలు మరియు మలినలు బయటకు వెళ్లిపోవడం ద్వారా కొత్త జుట్టు రావడంలో ఈ కార్డియో ఎక్సర్సైజ్ లు ఉపయోగపడతాయి.
◆ మ్యాజిక్ మెథడ్
ఇదొక అద్భుతమైన పద్దతి. దీనికి ఎలాంటి శారీరక శ్రమ కూడా అక్కర్లేదు. కేవలం ప్రతి రోజు ఒక పది నిమిషాలు ఈ పద్దతి ఫాలో అయితే చాలు. మంచం మీద వెల్లికిలా పడుకుని మంచం చివరగా తలను ఉంచాలి. ఇలా చేసినప్పుడు జుట్టు మంచం చివర కిందకు వేలాడుతుంది. ఇలా చేసినప్పుడు జుట్టును వదులుగా ఉంచుకోవాలి. వేలాడుతున్న జుట్టు లోపలికి వేళ్ళు పెట్టి కుదుళ్లను సున్నితంగా మర్దనా చెయ్యాలి.
తల కిందుగా ఉండటం వల్ల రక్త ప్రసరణ కుదుళ్లకు సమర్థవంతంగా జరుగుతుంది. మసాజ్ వల్ల ఆ రక్తరసరణ మొత్తం అంది వెంట్రుకలు మృదువుగా ఉండేలా మరియు దృఢంగా మరి పెరుగుదలకు సహకరించేలా మారుతాయి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
Also Read :- పాల లాంటి అందమైన బుగ్గల కోసం ఈ టిప్స్ పాటించండి